నల్గొండ జిల్లా కేంద్రంలో శుక్రవారం జరిగిన ఓ పెండ్లి అతిథులను విశేషంగా ఆకట్టుకుంది. నాగెండ్ల మేఘనారెడ్డి, కౌటిల్య వివాహం శుక్రవారం జరుగగా.. ప్రధాన ద్వారం మొదలుకొని, పెండ్లి పందిరితో పాటు భోజనాల వరకు అన్నీ పర్యావరణహిత పద్ధతిలో ఏర్పాటు చేశారు.
ప్రధాన ద్వారం వద్ద ఎడ్ల బండి ఇరుసులు, బంతి పూలు ఏర్పాటు చేసి, ఈతబుట్టలు, అరటి ఆకులతో తోరణాలు కట్టగా.. తాటాకులు, సహజమైన పూలతో పెండ్లి పందిరి సిద్ధం చేశారు. అలాగే విందు కోసం ‘ఆహారమే ఔషధం’ పేరుతో సేంద్రియ పద్ధతిలో సాగు చేసిన రకాలనే వాడుతూ... బూడిద గుమ్మడి హల్వా, కుంకుమ పువ్వు బియ్యంతో పులిహోరా, మైసూరు మల్లికతో కరివేపాకు రైస్, నవారా బియ్యంతో పెరుగన్నం, జొన్న రొట్టెలు, జొన్న గట్క, సర్వపిండి, సకినాలు, గుడాలు, భక్షాలు, పచ్చిపులుసు వంటి వెరైటీలను వడ్డించారు.
